హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ మహిళా జర్నలిస్టులను సత్కరించడం, సన్మానించడం ఆనందంగా ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నిజాన్ని నిర్భయంగా చెప్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మద్య వారధిగా నిలుస్తూ, ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా, వృత్తి ధర్మాన్ని, కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూ జర్నలిజం వృత్థిలో రాణిస్తున్న మహిళా జర్నలిస్టులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నానని అన్నారు సీఎం. మీ అందరినీ గౌరవించుకునే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.
ఆదివారం తెలంగాణ ప్రభుత్వం, సమాచార శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, సమాచార కమిషనర్ పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ఎ. రేవంత్ రెడ్డి స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇప్పటి వరకూ రూ.23 వేల కోట్ల రూపాయలు సున్నావడ్డీ రుణాలను అందించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది కూడా రూ.25వేల కోట్ల సున్నావడ్డీ రుణాలను ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.
ఇందిరా మహిళా శక్తి ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి , పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ, క్యాంటీన్లు, వంటి వివిధ కార్యక్రమాల ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు మహిళలకు ప్రత్యేకంగా అవకాశం కల్పించడం జరుగుతోందన్నారు ముఖ్యమంత్రి. మహిళా సాధికారతే ప్రజాప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను మహిళా లబ్ధిదారుల పేరున అందిస్తూ..రాష్ట్ర అభివృద్ధిలో కూడా వారిని భాగస్వాములను చేస్తోందన్నారు.


















