న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా గురువారం హస్తినలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈనెల చివరి వారంలో ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో తలపెట్టిన “గాంధీ సరోవర్ ప్రాజెక్టు” శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ ప్రాంతానికి ఉన్న ఛారిత్రక నేపథ్యాన్ని కేంద్ర మంత్రికి వివరించారు రేవంత్ రెడ్డి. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితాభస్మాన్ని ఈసా, మూసీ సంగమ స్థలిలో కలిపిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రజా ప్రభుత్వం తలపెట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా “గాంధీ సరోవర్” ప్రాజెక్టు చేపడుతున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ కి తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న బాపుఘాట్ ను భవిష్యత్ లో ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలపనున్నట్లు వివరించారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై కూడా ఇరువురు చర్చించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రడ్డి చరిత్ర సృష్టించారు. తను ఇప్పటి వరకు 60 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లారు. ఇప్పటి వరకు ఏ సీఎం ఇలా వెళ్లిన దాఖలాలు లేవు.
