లొంగిపోయిన మావోయిస్టుల‌కు పున‌రావాసం క‌ల్పిస్తాం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

hellotelugu-CM

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. లొంగి పోయిన మావోయిస్టుల‌కు పున‌రావాసం క‌ల్పిస్తామ‌ని అన్నారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు ముఖ్య నేతలు దేవ్ జీ, దామోదర్, రాజిరెడ్డి, చంద్రన్న తదితరులతో సమావేశమైనప్పుడు వారి పునరావాసానికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలు తన ముందు ఉంచారని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ ప్రతిపాదనలను కేంద్ర హోం మంత్రి అమిత్ చంద్ర షా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటు విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 721 మంది మావోయిస్టులు లొంగి పోయారని చెప్పారు.

లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మెరుగైన ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర ప్రభుత్వంతో, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల మేరకు చట్టపరమైన అంశాలను పరిశీలించి, కేసుల ఎత్తివేతపై ఆలోచన చేస్తామని అన్నారు. అవసరమైతే కేసుల పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

సమాజంలో హింసకు స్థానం లేదని, ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోతే వారికి ఆరోగ్యం, ఆర్థిక వెసులుబాటు, నివాస వసతి కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు చెక్కులను అందజేశారు.

Exit mobile version