హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి సజ్జనార్ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చైనీస్ మాంజాను అమ్మడం, నిల్వ చేయడం, రవాణా చేయడం , ఉపయోగించడం చట్ట రీత్యా నేరమని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా ప్రజలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986 ప్రకారం ఇది పూర్తిగా నిషేధించ బడిందని స్పష్టం చేశారు. తాము జారీ చేసిన ఆదేశాలను, ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై ఎటువంటి దయ లేకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని పేర్కొన్నారు.
సంక్రాంతి పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో చైనీస్ మాంజ ప్రజా భద్రతకు, పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. పదునైన సింథటిక్ థ్రెడ్ వల్ల ద్విచక్ర వాహనదారులకు మెడకు ప్రాణాంతక గాయాలు, పిల్లలకు వేళ్లకు తీవ్ర గాయాలు, పక్షులు, వన్యప్రాణుల మరణానికి కారణమైందని ఆయన అన్నారు. చైనీస్ మాంజా జీవఅధోకరణం చెందదని , సంవత్సరాల తరబడి వాతావరణంలో ఉంటుందని అన్నారు. దీనివల్ల దీర్ఘకాలిక పర్యావరణ నష్టం జరుగుతుందని సజ్జనార్ వివరించారు. విద్యుత్ తీగలతో సంబంధం వల్ల విద్యుదాఘాతం, మంటలు, ప్రాణనష్టం సంభవిస్తుందని కూడా ఆయన హెచ్చరించారు.















