న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నిప్పులు చెరిగారు. తన పేరును దుర్వినియోగం చేసినందుకు గాను హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌పై చర్యలు తీసుకోవాలని చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. జాతీయ రాజధానిలో జూలై 20న జరిగిన నిరసన సందర్భంగా విద్యార్థి కార్యకర్త నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌పై జరిగిన దాడికి సంబంధించి, 72 గంటల్లోగా నిందితుడిని అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీసులు సీజేపీ నిరసనకారులకు హామీ ఇచ్చిన కొద్ది గంటలకే, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నుండి స్వతంత్ర భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన పేరుతో పాటు ఇతర నాయకుల పేర్లను కూడా భరద్వాజ్ దుర్వినియోగం చేశారని పేర్కొంటూ ఆయనపై ఫిర్యాదు చేసినట్లు పాశ్వాన్ తెలిపారు. ప్రాణాంతకమయ్యే స్థాయి దాడిని నిందితుడు అంగీకరించినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోకపోవడం తప్పుడు సంకేతాలను ఇస్తుంది; ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూసే బాధ్యతను నేను తీసుకుంటాను అని పాశ్వాన్ అన్నారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా , కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో సహా పలువురు రాజకీయ నాయకులతో భరద్వాజ్ ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. జంతర్ మంతర్ వద్ద నిరసనకారుడి తండ్రిపై దాడి చేసినట్లు గొప్పగా చెప్పుకునే వీడియో వైరల్ కావడానికి చాలా కాలం ముందే, రెచ్చగొట్టే పోస్ట్‌లు, రాజకీయ నాయకులతో సాన్నిహిత్య ప్రదర్శనలు , వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా స్వతంత్ర భరద్వాజ్ సోషల్ మీడియాలో గణనీయమైన అనుచరులను సంపాదించుకున్నారు. ఒక ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అయిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ క్లిప్‌ల తాను సంజయ్ కుమార్ తల పగల గొట్టానని , అయినప్పటికీ జైలుకు వెళ్లకుండా తప్పించు కోగలిగానని భరద్వాజ్ చెప్పుకోవడం వినిపించింది. భరద్వాజ్ సోషల్ మీడియా ఉనికిని పరిశీలిస్తే, అటువంటి వ్యాఖ్యలు ఆయన రూపొందించుకున్న వ్యక్తిత్వానికి ఏమాత్రం భిన్నమైనవి కాదని అర్థమవుతుంది.

















