China : ఆధునిక వైద్య శాస్త్రం ప్రతిదినం కొత్త సాంకేతికతలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో చైనా పరిశోధకులు విప్లవాత్మక ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేశారు. విరిగిన లేదా పగిలిన ఎముకలను కేవలం మూడు నిమిషాల్లో స్థిరపరిచే బోన్ గ్లూ (Bone Glue) ను విజయవంతంగా అభివృద్ధి చేశారు.
China Bone Glue Technology
ఈ ఉత్పత్తిని “బోన్-02” పేరుతో తూర్పు చైనాలోని (China) జెజియాంగ్ ప్రావిన్స్‌లో సెప్టెంబర్ 10న ఆవిష్కరించారు. సర్ రన్ రన్ షా హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ లిన్ జియాన్‌ఫెంగ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. ఆయన ప్రకారం, నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే గుల్లల లక్షణాలే ఈ ఆవిష్కరణకు ప్రేరణగా నిలిచాయి.
ఈ బోన్ గ్లూ రక్తస్రావం ఎక్కువగా ఉండే వాతావరణంలో కూడా కేవలం 2–3 నిమిషాల్లో ఖచ్చితమైన స్థిరీకరణ అందిస్తుంది. అంతేకాకుండా, ఎముకలు పూర్తిగా మానిపోయిన తరువాత ఈ పదార్థం శరీరం సహజంగా శోషించుకుంటుంది. దీంతో, ఇంప్లాంట్లను తీసివేయడానికి మరో శస్త్రచికిత్స అవసరం ఉండదు.
ప్రయోగశాల పరీక్షల్లో ఈ ఉత్పత్తి అత్యుత్తమ పనితీరును ప్రదర్శించింది. ఒక ట్రయల్‌లో కేవలం 180 సెకన్లలో ప్రక్రియ పూర్తయ్యింది, అయితే సంప్రదాయ పద్ధతుల్లో స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అమర్చడానికి పెద్ద కోత అవసరం అవుతుంది. ఇప్పటికే 150 మందికి పైగా రోగులపై విజయవంతమైన పరీక్షలు నిర్వహించారు.
ఎముకలకు అతుక్కున్న తర్వాత, ఈ జిగురు గరిష్టంగా 400 పౌండ్లకు పైగా బలం, 0.5 MPa కోత బలం, 10 MPa సంపీడన బలం చూపించింది. దీనివల్ల మెటల్ ఇంప్లాంట్లకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా, ఇది సంక్రమణలు, ప్రతిచర్యల ముప్పును కూడా తగ్గిస్తుంది.
ఇప్పటివరకు మార్కెట్లో ఉన్న ఎముక సిమెంట్లు, పూరకాలు ఎటువంటి అంటుకునే లక్షణాలను కలిగి లేవు. 1940లలో అభివృద్ధి చేసిన పాత ఎముక గ్లూలు జెలటిన్, ఎపాక్సీ రెసిన్లు, అక్రిలేట్‌ల ఆధారంగా ఉండేవి. కానీ అవి బయోకంపాటిబిలిటీ సమస్యల కారణంగా విస్మరించబడ్డాయి. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ “బోన్-02” జిగురు మాత్రం వైద్యరంగానికి వినూత్న దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read : Heart Attack Risk : వీరికి రాత్రుళ్ళు ఎక్కువ గుండెపోటు వచ్చే ఛాన్స్



















