హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపుతో ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్రమార్కులు, కబ్జాదారులకు చుక్కలు చూపిస్తోంది. వారి గుండెల్లో రైళ్లు పరుగులు తీసేలా చర్యలకు దిగింది. ఇప్పటికే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టిన భవనాలను కూల్చేసింది. మరికొన్నింటిని కూల్చే పనిలో పడింది. చాలా చోట్ల కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులను స్వాధీనం చేసుకుంది. అక్కడ హైడ్రా పేరుతో ఇది ప్రభుత్వ స్థలం అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. మరో వైపు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. ఇదే క్రమంలో ప్రతీ సోమవారం క్రమం తప్పకుండా ప్రజా వాణిని నిర్వహిస్తూ వస్తోంది. స్వయంగా ఇందులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొంటున్నారు.
గతంలో తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులంతా నేరుగా హైడ్రాకు క్యూ కడుతున్నారు. తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. ఈ మేరకు కమిషనర్ కు ఫిర్యాదులు అందజేస్తున్నారు. ఇదిలా ఉండగా మేడ్చల్ – మల్కాజగిరి జిల్లా నిజాంపేట కార్పొరేషన్ బాచుపల్లిలో పార్కులు కాపాడినందుకు గాను అక్కడి చిన్నారులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. కాకతీయ కాలనీలో 600 గజాలు, 1500 గజాల రెండు పార్కులను రక్షించింది హైడ్రా. దీంతో హైడ్రా కు మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది చిన్నారులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. తమకు ఆడుకునే స్థలం దొరికింది అని సంబరపడ్డారు.ప్రాణవాయువును అందించే పార్కు స్థలాన్ని కాపాడారు. అందులో మొక్కలు నాటి జాగ్రత్తగా కాపాడుకుంటామని నినదించారు.
