అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను అందించే విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో సీఎం సమీక్షించారు. సమీక్ష సందర్భంగా పీపీపీ విధానంలో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం, మౌలిక వసతులపై కేంద్ర ప్రభుత్వ సూచనలను, మార్గదర్శకాలను అధికారులు వివరించారు. పీపీపీ ప్రాజెక్టుల అమలును ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం, ఆర్థిక వ్యవహారాల విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా పలు విధాన పరమైన ఆర్థిక సహాయ పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ క్రమంలో అమలులో ఉన్న వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద సామాజిక–ఆరోగ్య రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పీపీపీ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు.
ఇదే ఉద్దేశ్యంతో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద అందించే ఆర్థిక చేయూతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని కేంద్రం సూచించిందని వెల్లడించారు. ఇందులో భాగంగా వైద్య రంగంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఇచ్చే 60 శాతం ఆర్థిక మద్దతులో చెరో 30 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. వీజీఎఫ్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆసుపత్రులు, వైద్య కళాశాలు నిర్మించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని చెప్పారు. ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం పీపీపీ విధానాన్ని ప్రోత్సాహిస్తోందని వివరించారు. దీని ద్వారా వైద్య కళాశాలలు, ఆసుపత్రుల వంటి కీలక ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అభిప్రాయ పడినట్లు సీఎం దృష్టికి తెచ్చారు.















