మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు

చేయాల‌ని ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

hellotelugu-CM

హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా విశ్వ విద్యాల‌యం ప‌నులు వేగ‌వంతం చేయాలని ఆదేశించారు. ఆయ‌న విద్యారంగంపై స‌మీక్ష చేప‌ట్టారు. పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లో నూత‌న కోర్సులు, మౌలిక స‌దుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాల‌జీస్‌తో ఒప్పందం చేసుకున్నందున దానిని త్వ‌ర‌గా అమ‌ల‌య్యేలా చూడాలన్నారు సీఎం.
పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు, యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివ‌ర్సిటీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి విద్యార్థికి క‌చ్చితంగా ఉద్యోగం ల‌భించేలా సిల‌బ‌స్, బోధ‌న అందించాలని స్ప‌ష్టం చేశారు . ప్ర‌స్తుతం కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాలలో స్వ‌చ్ఛంద సంస్థ‌ల ద్వారా అమ‌లు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని తెలంగాణ‌ వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలను ప‌రిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

త‌గినంత స్థ‌లం, అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు అంద‌జేస్తే ప‌థ‌కాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయ‌గ‌ల‌మ‌ని సమావేశంలో పాల్గొన్న అక్ష‌య‌పాత్ర ప్ర‌తినిధులు తెలియ‌జేశారు. ప్ర‌తి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అంద‌రికీ స‌కాలంలో భోజ‌నం అందేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. సెంట్ర‌లైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎక‌రాల స్థ‌లం కేటాయింపు లేదా 99 సంవ‌త్స‌రాల‌కు లీజు తీసుకునే అంశంపై జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడి త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణారావుకి సూచించారు.

Exit mobile version