తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అంతకు ముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూవరాహ స్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా ముందుగా విష్వక్సే నారాధన, పుణ్య హవచనం, ముఖ ప్రక్షాళన, ధూప దీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభ ధారణలతో వైఖానస ఆగమ యుక్తంగా స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, నారాయణ సూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్ద జీయంగార్, శ్రీ చిన్న జీయంగార్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళికృష్ణ, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


















