హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగింది ఈసీ. ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సర్ ప్రక్రియ గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి , డిప్యూటీ సీఎఫ్ఓ ఎస్. చారిలతో కలిసి రాష్ట్రంలో కొనసాగుతున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ -2026’ ప్రక్రియపై జీహెచ్ఎంసీ కమిషనర్ , హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, అలాగే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా సర్ -2026 కింద నోటీసుల పంపిణీ , విచారణల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు.
ప్రతి నోటీసును బూత్ స్థాయి అధికారి సంబంధిత ఓటరుకు స్వయంగా అందజేసేలా చూడాలని స్పష్టం చేశారు సీఈవో. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల చిరునామాలను గుర్తించడానికి బీఎల్ఓలు ‘బూత్ స్థాయి ఏజెంట్ల’ సహాయం తీసుకోవాలని అన్నారు. జిల్లాలకు కేటాయించిన అదనపు లాగిన్‌లను వినియోగించుకుని, పెండింగ్‌లో ఉన్న అంశాలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల సమావేశాల్లో ‘అన్-మ్యాపింగ్’ ‘అసమానతలు/లోపాలు’ ఉన్న కేసుల జాబితాలను ఆయా పార్టీలతో పంచుకోవాలని సూచించారు సీఈవో. అలాగే దావాలు , అభ్యంతరాల స్వీకరణ సమయంలో బీఎల్ఏలు చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.
ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం బీఎల్ఓలు , సూపర్‌వైజర్లు, ఈఏఆర్ఓలు సంబంధిత పత్రాలను సరిగ్గా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. కంప్యూటర్ ఆపరేటర్లు తప్పులు చేయకుండా చూడాలన్నారు. వారి పర్యవేక్షణలో ఆపరేటర్లు చేసే తప్పులకు సంబంధిత ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విచారణ కేంద్రాల పరిధిలోకి రాని వృద్ధులు , దివ్యాంగుల నివాసాలకు స్వయంగా వెళ్లి వారిని సంప్రదించాలని సూపర్‌వైజర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు సీఈఓ.
















