హైదరాబాద్ : కేంద్రం ఖుష్ కబర్ చెప్పింది. హైదరాబాద్ లో త్వరలో చేపట్టబోయే రెండో దశ మెట్రో పనులకు 50 : 50 నిధుల వాటా కింద ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సమగ్ర ప్రాజెక్టు నివేదిక , ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాతే కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ రెడ్డికి తెలిపారు.హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రెండో దశలో రాష్ట్ర ప్రభుత్వంతో 50:50 నిధుల వాటా ప్రాతిపదికన పాలుపంచు కోవడానికి కేంద్రం సూత్రప్రాయంగా సిద్ధంగా ఉందన్నారు. ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్‌తో కలిసి హైదరాబాద్‌లోని కీలక అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించారు మంత్రి.
162 కిలోమీటర్ల మేర విస్తరించే రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రం సానుకూలంగా పరిశీలిస్తుందని మనోహర్ లాల్ తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సౌకర్యాలను మెరుగు పరచడంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తోందని కూడా మనోహర్ లాల్ పేర్కొన్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ‘అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ 2.0’ పథకం కింద మూసీ నదిని శుభ్రం చేయడానికి రూ. 3,975 కోట్ల వ్యయంతో 39 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ను కేంద్రం మంజూరు చేసినట్లు ప్రకటించారు జి. కిషన్ రెడ్డి. దేశవ్యాప్తంగా ఉన్న చట్టబద్ధమైన పట్టణాల్లోని అన్ని గృహాలకు పనిచేసే కుళాయి నీటి కనెక్షన్లను అందించడానికి, అలాగే అమృత్ మొదటి దశ కింద కవర్ అయిన 500 నగరాల్లో మురుగునీటి/సెప్టేజ్ నిర్వహణ సేవలను కల్పించడానికి ఈ కార్యక్రమం 2021లో ప్రారంభించారు.
