అహ్మదాబాద్ : ఐసీసీ టి20 టోర్నమెంట్ లో భారత జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడనుంది ఇవాళ అహ్మదాబాద్ వేదికగా. ఈ సందర్బంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. టోర్నీలో కీలకమైన బౌలర్ గా పరిగణిస్తూ వచ్చిన వరుణ్ చక్రవర్తి వికెట్లు తీస్తున్నప్పటికీ భారీ ఎత్తున పరుగులు ఇవ్వడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తనను తీసేసి కుల్దీప్ యాదవ్ ను తీసుకుంటే బావుంటుందని పెద్ద ఎత్తున ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో ప్రాక్టీస్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. వరుణ్ చక్రవర్తిని తుది జట్టుకు ఎంపిక చేస్తారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తమ జట్టు అత్యంత బలంగా ఉందన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నాడు.
ఇవాళ తాడో పేడో తేల్చుకునేందుకు తాము సిద్దమై ఉన్నామని ప్రకటించాడు. ఒక్కోసారి ఒక్కో బౌలర్ రాణిస్తాడని అంత మాత్రాన తీసేయాలన్న రూల్ ఏమీ లేదన్నాడు సూర్య కుమార్ యాదవ్. తను పరుగులు ఇచ్చినప్పటికీ కీలకమైన సమయంలో వికెట్లు తీస్తున్నాడని, అదే తమకు కావాల్సింది అని పేర్కొన్నాడు. దీన్ని బట్టి చూస్తే వరుణ్ చక్రవర్తిని కంటిన్యూ చేయబోతున్నట్లు అర్థం అవుతుంది. ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఇంకా నోరు మెదపలేదు హెడ్ కోచ్ గౌతం గంభీర్. తను ఎక్కువగా తన మనసులోని మాటలను బయట పెట్టడు. ఇవాళ మ్యాచ్ తమకే కాదు యావత్ భారత దేశానికి ఓ సవాల్ లాంటిదని అన్నాడు సూర్య కుమార్ యాదవ్.



















