హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రెండో విడత సర్పంచ్ , వార్డు మెంబర్ల ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులు భారీ ఎత్తున గెలుపొందారు. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడడంపై సీరియస్ అయ్యారు. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి విర్రవీగుతున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్‌పేట్ లో దారుణం చోటు చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థిపైకి ట్రాక్టర్ ఎక్కించి హత్యాయత్నంకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో ఫోన్లో మాట్లాడారు . గాయపడిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. కామారెడ్డి ఎస్పీతోనూ ఫోన్లో మాట్లాడారు కేటీఆర్
దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని, బీఆర్ఎస్ తిరగబడితే శాంతిభద్రతలు అదుపులో ఉండవని ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతి మించుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అమానుష ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు తెగబడటం పిరికిపంద చర్య అని మండిపడ్డారు.
















