Brahmanandam : హైదరాబాద్ – విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు భౌతిక కాయాన్ని చూసి బోరున విలపించారు హాస్య నటుడు బ్రహ్మానందం. ఇవాళ తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు కోట. తెలుగు చలన చిత్రసీమలో తీవ్ర విషాదం అలుముకుంది. నటీ నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కోటకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా తనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు బ్రహ్మానందం (Brahmanandam). ఆయన కన్నీళ్లను ఆపుకోలేక పోయారు. విలక్షణమైన నటుడే కాదు అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తామిద్దరం కలిసి వందల సినిమాలలో నటించామని గుర్తు చేసుకున్నారు. తనలోని ఒక భాగం కోల్పోయానని వాపోయాడు.
Brahmanandam Emotional
ఇదిలా ఉండగా కోట శ్రీనివాస రావు సినీ ప్రస్థానం చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతో ప్రారంభమైంది. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. విలన్ గా, కమెడియన్, తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా, పిసినారిగా, పోలీసుగా ఇలా అద్భుతమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం తర్వాత ఆ లోటును భర్తీ చేశారు.
నటనా పరంగా తెలుగునాట చెరిగిపోని ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు. ఆయన నటన చిరస్మరణీయం..అజరామరం. సినీ కళామతల్లి ఉన్నంత వరకు తను వెలుగుతూనే ఉంటారు. ఓవైపు నటుడిగా ఇంకో వైపు రాజకీయ నాయకుడిగా ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలలో ముఖ్య భూమిక పోషించారు. తనకు ఎదురే లేదని చాటారు కోట శ్రీనివాసరావు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.
Also Read : Chiranjeevi – Kota Death : కోటతో అనుబంధం చిరస్మరణీయం – చిరంజీవి
