బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో చోటు చేసుకున్న హింసాకాండ వెనుక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై తక్షణమే సర్కార్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది కావాలని కక్ష సాధింపులో భాగంగానే హింసకు ప్రేరేపించారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఎమ్మెల్యే జనార్దన రెడ్డి, బళ్లారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారింది, ఈ కాల్పుల ఘటనలో ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించాడు. ప్రభుత్వ అండతో కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ఘటనను ముందుగా పన్నాగం పన్నిన నేరపూరిత చర్య”గా చేశారని ఆరోపించారు.
మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కోసం బ్యానర్ ఏర్పాటు చేసే నెపంతో గాలి జనార్దన రెడ్డి , అతని కుటుంబాన్ని ఉద్దేశ పూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారని వాపోయారు. జనార్దన రెడ్డి, మాజీ మంత్రి బి శ్రీరాములు , ఇతర సీనియర్ బీజేపీ నాయకులకు తక్షణమే తగిన భద్రత కల్పించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బళ్లారిలో ప్రజాస్వామ్యం మనుగడలో లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే చురుకైన కుమ్మక్కుతో, అతని మద్దతుదారులు పౌర సమాజం శాంతియుత జీవితానికి భంగం కలిగించి, నగరాన్ని భయంతో నిండినదిగా మార్చే లక్ష్యంతో నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.
