ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుండి బెదిరింపులు వచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ నివేదించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ అనుచరులుగా భావించ బడుతున్న అర్జూ బిష్ణోయ్ మరియు టైసన్ బిష్ణోయ్ ఈ సందేశాన్ని జారీ చేశారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల నుండి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చినట్లు నివేదించింది. ఈ ముఠా లక్ష్యంగా చేసుకున్న తాజా బాలీవుడ్ ప్రముఖుడిగా ఆయన నిలిచారు. సోషల్ మీడియా పోస్ట్, దానికి జత చేసిన వాయిస్ నోట్ ద్వారా ఈ బెదిరింపు ప్రచారమైందని, వీటిని ముంబై పోలీసులు పరిశీలిస్తున్నారని నివేదిక పేర్కొంది.
అయితే ఇందకు సంబంధించి అమీర్ ఖాన్ లేదా ఆయన బృందం ఇప్పటి వరకు దీనిపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ ఆరోపణలు స్వతంత్రంగా ధృవీకరించ లేదు. లారెన్స్ బిష్ణోయ్ అనుచరులైన అర్జూ బిష్ణోయ్ , టైసన్ బిష్ణోయ్ ఈ సందేశాన్ని విడుదల చేశారు. నటుడు “లవ్ జిహాద్”ను ప్రోత్సహిస్తున్నారని ఆ పోస్ట్ ఆరోపించింది (ఇది ఆయన ఇటీవల చేసుకున్న మూడవ వివాహానికి సంబంధించిన ఆరోపణగా కనిపిస్తోంది) . అటువంటి ప్రవర్తనను ప్రోత్సహించే వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. గత నెలలో రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో అపహరణకు, అక్రమ రవాణాకు ,లైంగిక దాడికి గురైన 13 ఏళ్ల బాలిక ఉదంతాన్ని కూడా ఆ పోస్ట్ ప్రస్తావించింది. ఆ కేసులో అధికారులు వేగంగా స్పందించడాన్ని అభినందిస్తూనే, నిందితులలో ఎవరినైనా కాపాడటానికి ప్రయత్నించే రాజకీయ నాయకులను వదిలి పెట్టేది లేదని పేర్కొంది.
