అమరావతి : ఓ టీవీ ఛానల్ లో డిబేట్ సందర్బంగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు నోరు జారారు. ఆయన పవన్ కళ్యాణ్ , అమిత్ షా మధ్య జరిగిన చర్చల గురించి ప్రస్తావించారు. ఇదే సమయంలో ఓ జనసేన అగ్ర నేత ద్వారా తనకు తెలిసిందంటూ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఇన్ స్టంట్ మిత్రుడని కానీ జగన్ రెడ్డి లాంగ్ టర్మ్ స్నేహితుడని అందుకే తన పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించాలని ట్రబుల్ షూటర్ పవర్ స్టార్ కు సూచించినట్లు, ఇదే విషయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో కూడా జనసేనాని చెప్పాడంటూ పేర్కొన్నారు డాక్టర్ నాగేశ్వర్ రావు. దీంతో అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ చెప్పిన నేత ఎవరో బయటకు చెప్పాలంటూ డిమాండ్ మొదలైంది. దీనిపై తాజాగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రొఫెసర్ తన పరిధి దాటి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
దీంతో నాగేశ్వర్ రావుపై ఏపీలో పోలీస్ కేసు నమోదైంది. తాజాగా ఆయనకు నోటీసులు కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. కాకినాడ ఇంద్రపాలెం పోలీసులు తనపై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా నాగేశ్వర్ రావుపై జనసేన పార్టీకి చెందిన సిరంగు శ్రీనివాస రావు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరిస్థితి సీరియస్ కావడంతో మనోడు ఉన్నట్టుండి మాట మార్చాడు. నాదెండ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించు కుంటున్నట్లు తెలిపారు నాగేశ్వర్ రావు. వారికి క్షమాపణలు కూడా చెబుతున్నట్లు పేర్కొన్నారు. తనపై దాడులు చేసే అవకాశం ఉండడంతో తెలంగాణ పోలీసులు తనకు రక్షణ కల్పిస్తుండడం గమనార్హం.
