అమరావతి : రోజు రోజుకు ఏపీలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని , జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందని, బుధవారం కూడా ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.6°C, నెల్లూరు జిల్లా గూడూరులో 44.9°C, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 28 జిల్లాలకు గాను 23 జిల్లాల పరిధిలోని మొత్తం 233 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 26, నెల్లూరులో 25, ప్రకాశంలో 23, మార్కాపురంలో 20, కృష్ణాలో 18, తిరుపతిలో 17, నంద్యాలలో 14, ఎన్టీఆర్ లో 13, బాపట్లలో 13, విజయనగరం జిల్లాలోని 12 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°C – 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°C – 43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే రేపు శ్రీకాకుళం జిల్లాల్లో 18 మండలాలు, విజయనగరం 6, పోలవరం 4, విశాఖ 4, అనకాపల్లి 20, కాకినాడ 9, కోనసీమ 7, పశ్చిమగోదావరి1, ఏలూరు 1, కృష్ణా 1 మొత్తంగా 71 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 277 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
