ప్రారంభానికి సిద్ధ‌మైన బ‌మృకున్ – ఉద్‌- దౌలా చెరువు

సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి స‌న్నాహాలు

hellotelugu-HydRAA

హైద‌రాబాద్ : హైడ్రా ప్ర‌య‌త్నం ఫ‌లితాల‌ను ఇస్తోంది. హైద‌రాబాద్ లో మ‌రో రెండు చెరువులు న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయి. పాత‌బ‌స్తీలోని బ‌మృకున్ – ఉద్‌- దౌలా చెరువుతో పాటు.. కూక‌ట్ ప‌ల్లిలోని న‌ల్ల చెరువు ప్రారంభానికి సిద్ధ‌మ‌య్యాయి. ఈ నెల 6వ తేదీన బ‌మృకున్ – ఉద్ – దౌలా చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. ఆత‌ర్వాత మ‌రో రెండు మూడు రోజుల్లో కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును కూడా సీఎం న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేనున్నారు. హైడ్రా మొద‌ట విడ‌త చేప‌ట్టిన 6 చెరువుల్లో ఇప్ప‌టికే అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట గ‌తేడాది సెప్టెంబ‌రు 28న‌ ప్రారంభ‌మైన విష‌యం విదిత‌మే. మ‌రో మూడు చెరువులు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. వీటికి తోడు రెండో విడ‌త మ‌రో 14 చెరువుల‌ను హైడ్రా అభివృద్ధి చేయ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇలా న‌గ‌రంలో మురికి కూపాలుగా మారిన చెరువుల రూపురేఖ‌లు మార్చే ప‌నిలో హైడ్రా నిమ‌గ్న‌మైంది.

పాత‌బ‌స్తీకి మ‌ణిహ‌రం చారిత్ర‌క బ‌మృకున్ – ఉద్‌- దౌలా చెరువు. పాత‌బ‌స్తీలో నిజాంల నాటి చారిత్ర‌క చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. క‌బ్జాల‌ను తొల‌గించి ఊపిరిలూదింది. ఆక్ర‌మ‌ణ‌ల‌తో ఆన‌వాళ్లే కోల్పోయిన చెరువును బ‌తికించింది. చరిత్ర‌ను త‌వ్వి తీసిన మాదిరి చెరువును రూపొందించి చారిత్ర‌క వైభ‌వాన్ని హైడ్రా చాటింది. కాల‌గ‌ర్భంలో క‌లిసి పోయింద‌నుకున్న చ‌రిత్ర‌కు హైడ్రా ప్రాణం పోసింది. ఒక‌వైపు ఉన్న నాటి క‌ట్ట‌ను మ‌రింత ప‌టిష్టం చేసి వాకింగ్ ట్రాక్‌ను హైడ్రా నిర్మించింది. క‌ట్ట‌పై ఓపెన్ జిమ్‌ను పెట్టి అన్ని వ‌య‌సుల‌వారి ఆరోగ్యానికి బాట‌లు వేసింది. చెరువు లోప‌లి వైపు ఫెన్సింగ్ ప‌నుల‌ను పూర్తి చేసింది. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలను అభివృద్ధి చేశారు. వృద్ధులు సేద దీరే విధంగా అక్క‌డ గ‌జ‌బోలు న‌లువైపులా నిర్మించారు. చెరువుకు మూడు వైపులా ప్ర‌వేశ మార్గాల‌ను అందుబాటులోకి తెచ్చారు. నిజాంల కాలంలో ఈ చెరువుకు ఎంతో చ‌రిత్ర ఉంద‌ని.. దానిని పున‌రావృతం చేసేలా.. చుట్టూ ఔష‌ధ‌గుణాలున్న మొక్క‌ల‌తో పాటు.. చ‌ల్ల‌టి నీడనిచ్చే చెట్ల‌ను నాటారు. సీసీటీవీ కెమేరాల‌ను ఏర్పాటు చేసి.. హైడ్రా ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి ప‌ర్య‌వేక్షించేలా ఏర్పాట్లు చేశారు.

Exit mobile version