విజయవాడ : బీసీలు ఐక్యంగా ఉండాల్సిన అవశ్యకత ఎంతో ఉందని మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. బీసీల ఐక్యతను దెబ్బ తీయడానికి కుట్ర పన్నుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. . బీసీల పేరుతో కొందరు వైసీపీ నాయకులు నేరాలకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తప్పులు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. బీసీ యువత తమ హక్కుల సాధనకు పోరాటాలు చేయక తప్పదన్నారు. బీసీల అభివృద్ది కోసం సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కేవలం పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందజేసి బీసీలను నిర్లక్ష్యం చేయకూడదని, వారిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనేదే ఆయన సిద్ధాంతమని తెలిపారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న కుటుంబాన్ని జగన్ అవమానానికి, వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన తాత విలువలతో కూడిన రాజకీయాలు చేశారన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను లచ్చన్న కుటుంబం నుంచి వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారన్నారు. విచిత్రం ఏమిటంటే బీసీలను వేధింపులకు గురి చేసిన జగన్ నేడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇచ్చే డిగ్రీ పట్టా కాదని, ప్రజలు మాత్రమే ఇచ్చేదని విమర్శించారు.
