హైదరాబాద్ : మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని మండిపడ్డారు. విచారణ పేరుతో ఎలాంటి ఆధారాలు లేక పోయినా కావాలని , పనిగట్టుకుని తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్ ఓ, పీఏలను విచారణ చేపట్టడం, దాడులకు దిగడం దారుణమన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ముసుగులు ధరించిన పోలీసు సిబ్బందితో దాడి చేయించేలా జరిగిన కుట్రను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విచిత్రం పేరుతో వినాయక చవితి పండుగ ఉన్నప్పటికీ , విచారణ పేరుతో వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి దాడికి దిగడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో ముసుగు ధరించిన 15 మంది దుండగులు దాడికి పాల్పడడం దారుణమన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
న్యాయవాదుల బృందం ఈ దాడిని గమనించి అప్రమత్తం చేస్తూ జోక్యం చేసుకోవడంతో, ఆ ముసుగు ధరించిన పోలీసులు అక్కడి నుండి పారిపోయారని తెలిపారు . దాడి చేయడానికి ప్రభుత్వమే స్వయంగా ముసుగులు ధరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులను పోలీస్ స్టేషన్‌కు పంపడం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణించారు. పోలీస్ స్టేషన్ల లోపలే, పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులపై దాడులు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటే… ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపినందుకే వారు ఇలాంటి దాడులకు దిగుతారా అని నిలదీశారు హరీష్ రావు.
ఈ కేసులో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని కూడా బేఖాతరు చేస్తూ ఈ దాడికి ప్రయత్నించడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందన్నారు. హోం శాఖ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజీని వెంటనే విడుదల చేయాలన్నారు.

















