తిరుమల : శ్రీవారి భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. అక్టోబర్ 20వ తేదీ మంగళవారం నాటితో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీ మలయప్ప స్వామి వారు చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. వేణుగాన లీలలను స్ఫురింపజేసే శ్రీకృష్ణుని నర్తన రూపం భక్తులను పరవశింప జేసింది. చంద్రుని చల్లని వెన్నెల ప్రకృతికి ఆహ్లాదాన్ని, మనసుకు ప్రశాంతతను అందించినట్లే, చంద్రప్రభ వాహనంపై విహరించిన శ్రీవారి దివ్య మంగళ రూపం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. పరమశివుని శిరోభూషణంగా చంద్రుడు విరాజిల్లుతుండగా శ్రీమహావిష్ణువు వాహనంగా చంద్రప్రభ వెలుగొందడం హరిహర తత్త్వ సమన్వయాన్ని స్ఫురింపజేసే విశిష్ట ఆధ్యాత్మిక విశేషం.
నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీవారి దర్శనం భగవంతుని దివ్య లీలలను స్మరింప జేసింది. చంద్రుని శీతల కాంతులు, శ్రీకృష్ణుని లీలా మాధుర్యం, శ్రీవారి దివ్య తేజస్సు మేళవించిన ఈ వాహన సేవ తిరుమలలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ఇనుమడింప జేసింది. ఈ వాహన సేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, సీవీఎస్వో మురళీకృష్ణ తదితర , అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
