హైదరాబాద్ : యూరో ఎగ్జిమ్ బ్యాంక్ జారీ చేసిన గ్యారంటీలు నకిలీవని, ఆ సంస్థ ఆర్థిక మోసాలకు పాల్పడుతోందని వెలిచేటి రవి ప్రకాష్ ఆధీనంలోని ఆర్ టీవీ కథనాలు ప్రసారం చేయటాన్ని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ తొమ్మిదో అదనపు చీఫ్ జడ్జి కె. మురళీమోహన్ తప్పు పట్టారు. జర్నలిజం స్వేచ్ఛ పేరుతో అసత్య కథనాలు సరికాదని కోర్టు స్పష్టం చేసింది. ఆర్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు సంబంధించి ఏ ఒక్క ఆధారాన్ని కోర్టుకు సమర్పించ లేదని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్‌పై “మెగా స్కామ్” అంటూ ఆర్ టీవీ 2024 జులై, ఆగస్టు నెలల్లో ప్రసారం చేసిన నిరాధార, అపకీర్తికర ప్రసారాలపై తాత్కాలిక నిషేధాజ్ఞ (Interim Injunction) జారీ చేసింది. బ్యాంక్‌పై ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
యూరో ఎగ్జిమ్ బ్యాంక్ జారీ చేసిన గ్యారంటీలు “నకిలీవి”, బ్యాంక్ “భారీ ఆర్థిక మోసం”లో పాల్గొంటోంది అని ఆర్ టీవీ వార్తా కథనాలు ప్రసారం చేసింది. అలాగే ఆర్‌బీఐ, ఫెమా నిబంధనలను ఉల్లంఘిస్తోంది అంటూ ఆ కథనాల్లో ఆరోపణలు ప్రసారం చేసింది. ఈ కథనాలపై బ్యాంక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారణ సందర్భంగా కోర్టు ప్రత్యర్థుల వాదనలను సమీక్షించి, వారు చేసిన ఆరోపణలకు సంబంధించి ఎటువంటి పత్రాధారాలు, ధృవీకరించదగిన సమాచారం, విశ్వసనీయ మూలాలను సమర్పించలేదని గమనించింది. బ్యాంక్ గ్యారంటీలు మోస పూరితమైనవని నిరూపించడానికి ఎటువంటి ప్రాథమిక ఆధారాలు ఆర్ టీవీ, దాని యజమాని సమర్పించలేదు. బ్యాంక్‌పై చేసిన తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ప్రత్యర్థులు “ఒక చిట్టి కాగితం కూడా” సమర్పించలేదు. హవాలా లావాదేవీలు, అక్రమ గ్యారంటీలు, ఆర్‌బీఐ, ఫెమా ఉల్లంఘనలపై ఎటువంటి అధికారిక చర్యలు లేదా క్రిమినల్ కేసులు నమోదైనట్టు ఆధారాలు లేవు.
