ఏఈఈ నియామక పరీక్షల కోసం ఏర్పాట్లు ముమ్మరం

ఏపిఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి

hellotelugu-CMD

తిరుప‌తి : రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఏఈఈ పోస్టుల నియామకాల్లో భాగంగా అభ్యర్థులకు నియామక పరీక్ష-2026ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి వెల్ల‌డించారు. ఏపీట్రాన్స్ కో, ఏపీజెన్కో, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపిడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ సంస్థల్లో 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎఈఈ) పోస్టుల నియామకాలకై నిర్వహిస్తున్న ఈ పరీక్షకు 1,05,566 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈనెల 23 నుంచి 27వతేదీ వరకు ఐదు రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)ను నిర్వహించనున్నామని, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తం 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు.

ఏపీ విద్యుత్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కామన్ రిక్రూట్మెంట్ పరీక్షలను అధునాతన సాంకేతికతతో బయోమెట్రిక్ ధృవీకరణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, కేంద్రస్థాయి మానిటరింగ్ వ్యవస్థతోపాటు పటిష్టమైన పర్యవేక్షణతో నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు సీఎండీ. రాష్ట్రంలోని 5 విద్యుత్ సంస్థలకు ఒకే దరఖాస్తు విధానం ద్వారా అభ్యర్థులు సులువుగా దరఖాస్తు చేసుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ నిబంధనలు, అభ్యర్థుల ప్రాధాన్యత ఆధారంగా తుది ఎంపిక, కేటాయింపు జరుగుతుందని తెలిపారు. మొత్తం 629 పోస్టుల్లో ఏపీ ట్రాన్స్ కో- 200, ఏపీ ఈపిడీసీఎల్ –135, ఏపీఎస్పీడీసీఎల్ –134, ఏపీ జెన్కో -100, ఏపీసీపీడీసీఎల్ – 60 పోస్టులు ఉన్నాయని, ఎంపికైన అభ్యర్థులకు ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75,000 కన్సాలిడేటెడ్ వేతనం చెల్లించడం జరుగుతుందని వెల్ల‌డించారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం రెగ్యులర్ పే స్కేల్ వర్తిస్తుందని, ప్రొబేషన్ కాలం రెండు సంవత్సరాలు ఆన్ డ్యూటీగా ఉంటుందని సిఎండి వివరించారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఆగస్టు 23, 24, 25, 26, 27 తేదీల్లో అవసరాన్ని బట్టి రెండు సెషన్లలో నిర్వహించనున్నామని తెలిపారు. అలాగే ఆగస్టు 23న నిర్వహించే సివిల్ ఇంజినీరింగ్ పరీక్షను 16,183 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, 24న ఉదయం జరిగే మెకానికల్ ఇంజినీరింగ్ పరీక్షకు 9,444 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, 25న రెండు సెషన్లలో నిర్వహించే టెలికాం/ఎలక్ట్రానిక్స్ పరీక్షకు 26,237 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని స్ప‌ష్టం చేశారు. ఇక అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పరీక్షను ఆగస్టు 26, 27 తేదీల్లో నిర్వహించనున్నామని, ఈ పరీక్షకు మొత్తం 53,702 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.

ప్రతి పరీక్ష ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతుందని వివరించారు. అభ్యర్థులు ఉదయం 7:30 గంటల నుంచి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని, ఉదయం 9:00 గంటలకు గేట్లు మూసి వేస్తారన్నారు. అలాగే మధ్యాహ్నం 1:00 గంట నుంచి రిపోర్టింగ్ సమయం ఉండగా, 2:30 గంటలకు గేట్లు క్లోజ్ చేస్తార‌ని పేర్కొన్నారు. ఈ పరీక్షను ఆంగ్ల మాధ్యమంలో ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారని, మొత్తం 100 మార్కులకు, ఇందులో 70 మార్కులు టెక్నికల్, 30 మార్కులు నాన్-టెక్నికల్ విభాగాలకు చెందిన అంశాలు ఉంటాయని, నెగెటివ్ మార్కింగ్ ఉండదని, పరీక్షను పలు సెషన్లలో నిర్వహిస్తున్నందున నిర్ణీత విధానం ప్రకారం స్కోర్ల నార్మలైజేషన్ చేపడతారని శివ‌శంక‌ర్ లోతేటి వివరించారు.

Exit mobile version