మే 12న నర్సింగ్ ఆఫీసర్ల‌కు నియామ‌క ప‌త్రాలు

వెల్ల‌డించిన మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ‌

hellotelugu-Damodara

హైద‌రాబాద్ : వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు పూర్తి చేసింద‌న్నారు. ఇటీవలే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశామ‌ని, ఎంపికైన వారికి మే 12న నియామ‌క పత్రాలు అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌, మెడికల్ కాలేజీల్లో జరుగుతున్న పోస్టుల భర్తీపై సమావేశంలో చర్చించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ హాస్పిటల్స్‌లో భర్తీ చేస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. అలాగే, ఫార్మసిస్ట్ పోస్టులు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (MPHA-Female) పోస్టుల భర్తీ ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు.

వచ్చే నెల 15వ తేదీ నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. ఫార్మసిస్ట్‌, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెలకొన్న లీగల్ చిక్కులను పరిష్కరించి, భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ రెండేళ్లలో సుమారు 12,650 పోస్టులను భర్తీ చేశామని, మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తయితే.. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉద్యోగాల భ‌ర్తీ చేప‌ట్టామ‌ని చెప్పారు దామోద‌ర రాజ న‌ర‌సింహ‌.

Exit mobile version