హైదరాబాద్ : ఇడుపు కాయితం సినిమాకు సంబంధించి పనిగట్టుకుని ట్రోల్స్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్. తెలంగాణా భాష, యాస, సంస్కృతిని ప్రతిబింబిస్తూ రూపొందుతున్న ఈ మూవీ సినిమా టైటిల్‌పై కొంతమంది చేస్తున్న అవమానకరమైన ట్రోల్స్‌ను తీవ్రంగా ఖండించింది. ఒక ప్రాంతీయ భాష, దాని యాస, సంస్కృతిపై ఇలా అపహాస్యం చేయడం అనేది కేవలం ఒక సినిమా లేదా టైటిల్‌పై విమర్శ కాదని, అది ముమ్మాటికీ తెలంగాణా గౌరవంపై దాడిగా మేము భావిస్తున్నామని పేర్కొంది.
తెలంగాణా భాషకు ప్రత్యేకమైన చరిత్ర, గౌరవం, భావోద్వేగం ఉందని తెలిపింది. అలాంటి భాషను కించపరచడం అంటే తెలంగాణా తల్లి గౌరవాన్ని అవమాన పరచడమేనని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను వ్యక్తపరచడం ప్రతి ఒక్కరి హక్కే అయినప్పటికీ, అవమానకరమైన, ప్రాంతీయ అసహనాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం అసలు ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి దుర్వ్యవహారాలను సినిమా పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికీ ఈ అంశంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించక పోవడం విచారకరం అని మండిపడింది..
సినిమా పరిశ్రమకు మార్గదర్శక సంస్థలైన ఈ రెండు ఛాంబర్లు వెంటనే స్పందించి, తెలంగాణా భాషా గౌరవాన్ని కాపాడే విధంగా స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది..
ఇకపై కూడా ఇలాంటి అవమానకరమైన దోరణులు కొనసాగితే, తెలంగాణా సమాజం పక్షాన నిలబడి, ఇటువంటి సామాజిక దాడులను ఎదుర్కొనేందుకు తెలంగాణా ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎప్పటికీ వెనుకాడదని హెచ్చరించింది.



















