కర్నూల్ జిల్లా : ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూల్ నియోజకవర్గం శాసన సభ్యులు టీజీ భరత్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన రెచ్చి పోయారు. తాను మౌనంగా ఉన్నానని , ఇదే అదునుగా చేసుకుని తన నియోజకవర్గంలో చిల్లర రాజకీయాలు చేయాలని కొందరు చూస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు ఎవరు చేసినా తాను చూస్తూ ఊరుకోబోనంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మంత్రి చేసిన తాజా కామెంట్స్ జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలో కలకలం రేపాయి. ఇక నుంచి ఎవరైనా, ఏ స్థానంలో ఉన్నా సరే తమ తమ పరిధిలో ఉంటే మంచిదని హితవు పలికారు. తానేమిటో తన మనస్తత్వం ఏమిటో నియోజకవర్గం ప్రజలకు బాగా తెలుసని అన్నారు.
అయితే తాను మంత్రి అయినప్పటి నుండి ఎవరి జోలికి వెళ్లలేదని చెప్పారు టీజీ భరత్. కానీ కొంతమంది కావాలని నా నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలియదని వారు అనుకుంటున్నారని, కానీ ఎవరు ఏం చేస్తున్నారో తనకు మినట్ టు మినట్ సమాచారం వస్తుందని చెప్పారు. నన్ను గెలికితే మీరే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. నా స్ట్రాటజీలు తట్టుకోలేరని అన్నారు. తాను గెలిచింది మొదటి సారే అయినప్పటికీ ఎవరిని ఎక్కడ ఉంచాలో తనకు బాగా తెలుసని అన్నారు మంత్రి టీజీ భరత్. పదవి వచ్చాక నేను పెద్దగా రాజకీయాలు చేయలేదని అన్నారు. కానీ నన్ను ఎవ్వడైనా గెలికితే నేను ఏంటో చూపిస్తా అంటూ సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.















