AP Heavy Rains : అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆదివారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బంగాళా ఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 8కి.మీ వేగంతో కదులుతోందని తెలిపారు. మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హెచ్చరించారు ఎండీ. సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం ఉందన్నారు. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
AP Heavy Rains Warning
ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 550 కి.మీ, చెన్నైకి 850 కి.మీ, విశాఖపట్నంకి 880 కి.మీ, కాకినాడకి 880 కి.మీ, గోపాల్‌పూర్ కి 960 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయి ఉందన్నారు ప్రఖర్ జైన్. ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటుతుందని పేర్కొన్నారు. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే ఛాన్స్ ఉందన్నారు. కాగా తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు ప్రఖర్ జైన్. వాయుగుండం కారణంగా సోమవారం, మంగళవారం కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజజలతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఎండీ హెచ్చరించారు.
Also Read : Minister Damodar Shocking Comments : ఎంజీఎం సూపరింటెండెంట్ పై వేటు
















