మెట్టూరు ఆన‌క‌ట్టపై డీఎంకే, అన్నాడీఎంకే ప్ర‌స్తావ‌న

నీటి విడుద‌ల చేయ‌డం ప‌ట్ల సీరియ‌స్ కామెంట్స్

hellotelugu-TamianduAssembly

చెన్నై : నీటి పారుదల కోసం మెట్టూరు ఆనకట్టను తెరవాలన్న అంశాన్ని లేవనెత్తాయి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు. పళని నియోజకవర్గంలోని అయాకుడిలో కొత్త ప్రభుత్వ బాలికల వసతి గృహ నిర్మాణం , డెల్టా రైతుల కోసం మెట్టూరు ఆనకట్ట నుండి నీటిని విడుదల చేయడంపై అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అయాకుడి టౌన్ పంచాయతీలో నడుస్తున్న ప్రభుత్వ బాలికల వసతి గృహం కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని పళని ఎమ్మెల్యే రవి మనోహరన్ కోరారు. ఈ డిమాండ్‌పై స్పందిస్తూ మంత్రి వన్ని అరసు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థలో ఉందని, పాత నిర్మాణాన్ని కూల్చివేసి తొలగించాలని జిల్లా ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ₹3.70 కోట్ల అంచనా వ్యయంతో 50 మంది బాలికలకు వసతి కల్పించేలా కొత్త హాస్టల్ భవనాన్ని నిర్మిస్తామని ఆయన చెప్పారు. హాస్టల్‌కు వీలైనంత త్వరగా సొంత శాశ్వత భవనం సమకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ‘ప్రత్యేక దృష్టిని ఆకర్షించే తీర్మానం’ సందర్భంగా డెల్టా నీటిపారుదల కోసం మెట్టూరు ఆనకట్టను తెరవాలనే అంశం చర్చకు వచ్చింది. కావేరీ డెల్టా జిల్లాల్లోని రైతులు నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారని, ఆనకట్టను ఎప్పుడు తెరుస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డీఎంకే ఎమ్మెల్యే గోవి చెజియన్ కోరారు. ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి కె. పళనిస్వామి మాట్లాడుతూ ఈ అంశంపై అన్నాడీఎంకే ఇప్పటికే ఒక తీర్మానాన్ని సమర్పించిందని తెలిపారు. కురువై సాగుకు నీరు విడుదల కాలేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తగినంత నిల్వ లేకపోవడం వల్ల నీరు విడుదల కాలేదన్న నీటిపారుదల శాఖ మంత్రి ప్రకటనను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం రిజర్వాయర్‌లోకి నీరు వచ్చి చేరుతోందని, డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పళనిస్వామి పేర్కొన్నారు.

సాంబ సాగు కోసం నీరు విడుదల చేస్తారా, ఒకవేళ చేస్తే ఎప్పుడు చేస్తారని ఆయన ప్రశ్నించారు. సాగుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా, నీటి విడుదలకు కనీసం 15 రోజుల ముందే రైతులకు సమాచారం అందించాలని ఆయన నొక్కి చెప్పారు. ఈ చర్చకు సమాధానంగా, మెట్టూర్ డ్యామ్ ప్రారంభంపై త్వరలోనే “శుభవార్త” వెల్లడిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఆనంద్ తెలిపారు.

Exit mobile version