అమరావతి : రాష్ట్రంలో పంటల బీమా అమలును సమగ్రంగా పునః సమీక్షించేందుకు వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్‌కమిటీని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని చెప్పారు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. కమిటీ సిఫార్సుల మేరకు ఖరీఫ్ 2024 సీజన్‌కు ఈ-క్రాప్ నమోదు ఆధారంగా ఉచిత పంటల బీమాను అమలు చేశామని, రబీ 2024-25 నుంచి రైతు భాగస్వామ్యంతో స్వచ్ఛంద నమోదు విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ఖరీఫ్ 2019 నుండి 2022 వరకు మాత్రమే బీమా పరిహారం చెల్లించబడగా, రబీ 2019-20, 2020-21, 2021-22 సీజన్లకు నోటిఫికేషన్ కూడా జారీ కాలేదని విమర్శించారు.
రబీ 2022-23కు రూ.645.42 కోట్లు, ఖరీఫ్ 2023కు రూ.928.8 కోట్లు, రబీ 2023-24కు రూ.415.84 కోట్లు చెల్లించకుండా మొత్తం రూ.1,990.06 కోట్ల భారం ప్రస్తుత ప్రభుత్వంపై మోపబడిందన్నారు అచ్చెన్నాయుడు. కేంద్రం సూచనల మేరకు ఈ మొత్తాన్ని వాయిదాలుగా చెల్లించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. స్వచ్ఛంద విధానంలో రైతులకు తక్కువ ప్రీమియంతో అవకాశం కల్పించామని, వాణిజ్య మరియు ఉద్యాన పంటలు మినహా ఇతర పంటలకు రబీలో గరిష్టంగా 1.5%, ఖరీఫ్‌లో 2% మాత్రమే రైతు చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% వర్తిస్తుందని, మిగిలిన ప్రీమియంను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని చెప్పారు. ఖరీఫ్ 2024, రబీ 2024-25, ఖరీఫ్ 2025 సీజన్ల క్లెయిమ్‌ల పరిష్కారం నిబంధనల ప్రకారం జరుగుతోందని అన్నారు. 2026-27లో పంటల బీమా అమలుకు రూ.250 కోట్లు ప్రతిపాదించామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
















