అమరావతి : రాష్ట్రంలో ప్రతీ ఎకరాకూ నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వటమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై త్వరలోనే బ్లూ ప్రింట్ తయారు చేస్తామని శాసనసభలో వెల్లడించారు. సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా పది సూత్రాలను రూపొందించుకుని నీటి భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని ఆయన అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నా నీటి భద్రత అత్యంత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది గోదావరి, మరుసటి ఏడాదిలో కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి వచ్చిందని అన్నారు.
ప్రకృతిని, నదులు, నీటి వనరులను ఆరాధించే సంస్కృతి ఉన్న నేపథ్యంలో గోదావరి నదికి అఖండ హారతిని, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చి జలాలను అత్యంత విలువైన వనరులుగా భావించి బాధ్యతగా వ్యవహరిస్తున్నామని సీఎం అన్నారు. ప్రతీ ఏటా గోదావరి నది నుంచి సగటున 3 వేల టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. అందుకే రాష్ట్రంలోని వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలోని నదులను అనుసంధానిస్తే నీటి సమస్యలు పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలోనూ గంగా- కావేరి నదుల అనుసంధానం జరగాలన్నది తన బలమైన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో గంగా- కావేరీ నదుల అనుసంధాన సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయన్నారు. అందుకే రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.


















