Heart Attack : గుండె ఆరోగ్య సంరక్షణలో అనేక దశాబ్దాలుగా విస్తృతంగా వాడుతున్న ఆస్పిరిన్ స్థానంలో భవిష్యత్తులో మరో మందు ఉపయోగించే అవకాశముందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. తాజా అధ్యయనాల ప్రకారం క్లోపిడోగ్రెల్ (Clopidogrel) అనే ఔషధం, ఆస్పిరిన్‌తో పోలిస్తే గుండెపోటు (Heart Attack), స్ట్రోక్‌లను నివారించడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు వెల్లడించారు.
Heart Attack – పరిశోధన వివరాలు
యూరోప్‌లో సుమారు 29,000 మంది రోగులపై 7 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. వాటిలో క్లోపిడోగ్రెల్ వాడకం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు ఆస్పిరిన్‌తో పోలిస్తే 14% తక్కువగా నమోదయ్యాయి. రక్తస్రావం ప్రమాదం మాత్రం రెండింటిలోనూ దాదాపు సమానంగా ఉన్నట్టు తేలింది. ఈ ఔషధం ప్రభావం వాడిన రెండుగంటల్లోనే ప్రారంభమై, 5 రోజులపాటు కొనసాగుతుంది అని వైద్యులు తెలిపారు.
క్లోపిడోగ్రెల్ అంటే ఏమిటి?
క్లోపిడోగ్రెల్ (Clopidogrel), మార్కెట్లో ప్లావిక్స్ (Plavix) పేరుతో కూడా లభిస్తుంది. రక్తంలోని ప్లేట్‌లెట్‌లు గడ్డకట్టకుండా అడ్డుకోవడం ద్వారా రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. గుండె సమస్యల తర్వాత లేదా స్టెంట్‌లు అమర్చిన రోగులకు దీనిని తరచుగా సూచిస్తారు.
దీర్ఘకాలిక వాడకంపై నిపుణుల అభిప్రాయం
మునుపటి అధ్యయనాలూ ఈ ఫలితాలకు మద్దతు ఇస్తున్నాయి. దాదాపు 16,000 మందిపై చేసిన మరొక పరిశోధనలో, ఆస్పిరిన్‌తో పోలిస్తే క్లోపిడోగ్రెల్ వాడిన రోగుల్లో గుండెపోటు, స్ట్రోక్ లేదా మరణం ప్రమాదం 23% వరకు తగ్గిందని తేలింది. అదనంగా రక్తస్రావం ప్రమాదం కూడా పెద్దగా పెరగలేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు గుండెపోటు నివారణలో ఆస్పిరిన్ ప్రధాన మందుగా ఉపయోగిస్తున్నా, తాజా పరిశోధనల ప్రకారం క్లోపిడోగ్రెల్ మరింత సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Vitamin B12 Deficiency Shocking : మీకు ఈ అలవాటు ఉందా? అయితే వెంటనే జాగ్రత్త పడండి



















