తిరుపతి : దేశ రాజధాని న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 1 నుండి 9వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ఏప్రిల్ 30న అంకురార్పణం జరుగనుంది. బ్రహ్మోత్సవాల ముందు భాగంగా ఏప్రిల్ 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహిస్తారు. మే 1వ తేదీ రాత్రి 09.00 గంటల నుండి 10.30 గంటల మధ్య మిధున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 10వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటలవరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
వాహన సేవల పరంగా చూస్తే మే 1వ తేదీన ఉదయం ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం, 2న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 3వ తేదీన ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 4న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 5వ తేదీన ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహనం, 6వ తేదీన ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం, 7వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 8న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం, 9వ తేదీన ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం జరుగుతుందని తెలిపింది టీటీడీ.



















