తిరుపతి : నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం భక్తి వైభవంతో ఘనంగా నిర్వహించారు. వేదఘోషల మధ్య నిర్వహించిన ఈ పవిత్ర కార్యక్రమం ఆలయాన్ని ఆధ్యాత్మిక కాంతులతో అలంకరించింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమలసేవ, అర్చన వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం మృత్సగ్రహణం, సేనాధిపతి ఉత్సవం జరిపి, బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా చేపట్టారు. మే 1న ఉదయం మేష లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు తిరుచ్చి ఉత్సవం, 5.30 నుండి 6.30 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహించచారు. ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహన సేవలు, స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవలు నిర్వహించి భక్తులకు దివ్యానుభూతిని కలిగించనున్నారు.
ఉత్సవాలలో భాగంగా 2వ తేదీన ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనంపై ఊరేగుతారు స్వామివారు. 3న ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 4న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం, 5న ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం, 6న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం, 7న సూర్య ప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 8న రథోత్సవం, సాయంత్రం ఆర్జిత కళ్యాణోత్సవం. రాత్రి అశ్వ వాహనం, 9న ఉదయం చక్ర స్నానం, రాత్రి ధ్వజావరోహణం జరగనుంది.
