పాలమూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి. తెలంగాణ ప్రాంతం గురించి నోరు పారేసు కోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదే క్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం బేషరతుగా తెలంగాణ ప్రాంతపు ప్రజలకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ కు డెడ్ లైన్ విధించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా ఆయన అనుచరుడిగా ముద్ర పడిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికి వచ్చినట్లు ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని అన్నారు. తాను ఉన్నంత వరకు జడ్చర్ల నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నటించే సినిమాలను ఆడనివ్వనంటూ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ నన్నేం పీకుతారని అనుకోని క్షమాపణలు చెప్పడం లేదని భావిస్తున్నారని, కనీసం స్పందించడం కూడా లేదన్నారు. కాగా వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే వాళ్ళు కచ్చితంగా దీనిపై స్పందిస్తారని చెప్పారు.



















