Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ రూ.17,000 కోట్ల విలువైన లోన్ మోసం కేసు నేపథ్యంలో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఈడీ (ED) ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయనను, అధికారులు 11:30 గంటల నుంచి విచారిస్తున్నట్లు సమాచారం.
ED Serve Notices to Anil Ambani
విశ్వసనీయ వర్గాల ప్రకారం, ఈ విచారణలో అనిల్ అంబానీ లాయర్లను లోపలికి అనుమతించలేదు. ఆయన్ను ప్రత్యక్షంగా అధికారులు ప్రశ్నిస్తూ, మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) ప్రకారం జరుగుతోంది.
ఈ కేసులో భాగంగా, ఈడీ ఆగస్టు 1వ తేదీన అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసి, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అదనంగా, విచారణను దృష్టిలో ఉంచుకొని లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది.
సంబంధిత అరెస్టులు మరియు కేసు నేపథ్యం
ఈ కేసులో బిశ్వాల్ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిశ్వాల్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. రూ.68.2 కోట్ల విలువైన నకిలీ గ్యారంటీలను సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. ఆయనపై కూడా మనీలాండరింగ్ నిబంధనల కింద కేసు నమోదు అయింది.
కేసు వివరాలు
2017 నుండి 2019 మధ్య కాలంలో రిలయన్స్ గ్రూప్ యస్ బ్యాంక్ నుంచి దాదాపు రూ.3,000 కోట్లకు పైగా లోన్లు పొందినట్లు నమోదైంది. ఈ నిధులను అనధికారికంగా ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. ఈదీ తేల్చిన ప్రకారం, లోన్ మంజూరుకు ముందు బ్యాంకు ప్రమోటర్లకు భారీ మొత్తంలో నిధులు అందినట్లు గుర్తించింది. ఈ వ్యవహారాన్ని ‘క్విడ్ ప్రో కో’ గా పరిగణించింది.
అంతేకాకుండా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ పేరు మీద మరో రూ.14,000 కోట్లకు పైగా లోన్ల మోసం జరిగిందని ఈడీ ప్రాథమికంగా నిర్ధారించింది. మొత్తం రూ.17,000 కోట్ల విలువైన లోన్ల వ్యవహారంపై వివిధ బ్యాంకులకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే అనేక బ్యాంకులకు లేఖలు పంపించి లోన్ల సమాచారం కోరినట్లు ఈడీ అధికారులు తెలిపారు.
తదుపరి చర్యలపై ఆసక్తికరత
ఈ విచారణ అనిల్ అంబానీపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశముంది. స్టేట్‌మెంట్లు, బ్యాంక్ లావాదేవీల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశముందని సమాచారం. కేసు క్రమంగా సాగుతూ, మరిన్ని అనుబంధాల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : Indian Rupee Fall Sensational : సుంకాల మోతకు పతనమైన రూపాయి విలువ


















