అమరావతి : తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు సిద్దమైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ మహానాడు వేదికగా కీలక ప్రకటన చేయనున్నారు, దిశా నిర్దేశం చేస్తారు పార్టీ చీఫ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు మహానాడు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం పసుపుమయం అయి పోయింది. మంత్రి నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదే. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఏం ప్రసంగిస్తారు.. ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారనే ఆసక్తి అందరిలోనూ కన్పిస్తోంది. ఇక గతానికి భిన్నంగా 2026 మహానాడును నిర్వహిస్తున్నారు. ఇటు ఫిజికల్‌గా.. అటు వర్చువల్ పద్దతిలో మహానాడు జరగనుంది.
ముందుగా నెల్లూరులో మహానాడు చేపట్టాలని భావించినా… పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో నెల్లూరులో మహానాడు చేపట్టాలన్న నిర్ణయంలో మార్పు జరిగింది. మోదీ పిలుపునకు మద్ధతుగా ఇంధన పొదుపు విధానాలను పాటిస్తూ మహానాడు నిర్వహించనున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతోపాటు.. జాతీయ, రాష్ట్ర కార్యావర్గాలకు చెందిన సభ్యులు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫిజికల్‌గా మహానాడులో పాల్గొంటారు. ఈ కమిటీల్లో లేని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా వారి వారి ప్రాంతాల నుంచి వర్చువల్ పద్దతిలో మహానాడులో పాల్గొంటారు. వర్చువల్ పద్దతిలో క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 1,800కు పైగా క్లస్టర్లల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ కూడా పండుగ వాతావరణంలో మహానాడను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

















