అమరావతి : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం పెరవలి జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా తనపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్న వారి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిని అనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మాట్లాడాలని హితవు పలికారు. తాను జనసేన పార్టీ పెట్టింది తన కోసం కాదన్నారు. కేవలం ప్రజల కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. అలా సంపాదించాలని అనుకుంటే తనకు సినిమాలు ఒక్కటే చాలన్నారు. ఒక్క సినిమాకు కోట్లు తీసుకునే తాను ఎందుకు ప్రజా సేవ కోసం ముందుకు వచ్చానో ఒక్కసారి ఆలోచించు కోవాలని అన్నారు.
పార్టీ పెట్టి కూడా తాను పదేళ్లు వెనక్కి తగ్గానని, ప్రజల కోసం సీట్లు తగ్గించుకున్నానని చెప్పారు. కొందరు కావాలని తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని కానీ వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు. అంతే కాకుండా తాను సీట్లు అమ్ముకుంటున్నానని నన్ను విమర్శించారు. ఆపై ఊరుకోకుండా విదేశాల్లో కూర్చొని మాపై వాగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదల. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు చేసిన దౌర్జన్యాలకు మేం భయపడలేదని అన్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో గౌరవం ఇస్తే తీసుకోవడం లేదన్నారు. అందుకే అందరికీ యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇస్తున్న ట్రీట్‌మెంట్ ఇక్కడ కూడా అమలు చేయాలన్నారు .
