పుట్టపర్తి/శ్రీసత్యసాయి జిల్లా : ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ఠ్రంలో విధ్వంస పాలనతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి చరిత్రలో వెన్నుపోటు దారుడిగా నిలిచి పోయారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత విమర్శించారు. కూటమి ప్రభుత్వంతోనే ఏపీ ప్రజల భవిష్యత్తుకు భరోసా లభిస్తోందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి పైనా, గత పాలనలో జరిగిన విధ్వంసం పైనా చర్చకు సిద్ధమని వైసీపీ నాయకులకు మంత్రి సవిత సవాల్ విసిరారు. పుట్టపర్తిలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు సహా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, పరిటాల సునీత, పల్లె సింధూర రెడ్డి, ఎంపీ బీకే పార్థసారథితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్గుకునేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో అత్యధిక శాతం ఏపీకే తరలి వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, రాజధాని అమరావతిని, పోలవరం ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేస్తున్నారన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం -2 పథకాలతో పాటు అధికారంలోకి రాగానే పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు తమ ప్రభుత్వం పెంచిందన్నారు. కూటమిలో ఉన్న పార్టీల కార్యకర్తలు గర్వపడేలా రెండేళ్ల పాలన సాగిందని మంత్రి సవిత తెలిపారు.
