సబ్సిడీపై రైతుల‌కు విత్తనాల పంపిణీ

స్ప‌ష్టం చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం

hellotelugu-APSeeds

అమ‌రావ‌తి : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా పంట ఉత్పత్తి పెంపునకు కట్టుబడి ఉన్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2014-15 నుండి 2018-19 వరకు తెదేపా ప్రభుత్వ హయాంలో వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, శెనగలు, మినుములు, పెసలు, కందులు, బొబ్బర్లు, ఉలవలు, సోయాబిన్, రాజ్మా, వేరుసెనగ, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం, పచ్చిరొట్ట వంటి పంటలకు చెందిన 49.22 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేశామని పేర్కొన్నారు. అదే సమయంలో శనగ విత్తనాలపై సబ్సిడీని 33.33% నుండి 50%కు, పచ్చిరొట్ట విత్తనాలపై 50% నుండి 75%కు పెంచి రైతులకు మద్దతుగా నిలిచామని తెలిపారు. గత ప్రభుత్వం కాలంలో శనగ సబ్సిడీని 50% నుండి 25%కు, పచ్చిరొట్ట సబ్సిడీని 75% నుండి 50%కు తగ్గించడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.

కొన్ని హైబ్రిడ్ మరియు పప్పు ధాన్య విత్తనాల సరఫరాలో కూడా లోపాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 2024-25 సీజన్‌లో 13.88 లక్షల మంది రైతులకు రూ.268.41 కోట్ల సబ్సిడీ విలువైన 7.88 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామని వెల్లడించారు. 2025 ఖరీఫ్ నుండి ఇప్పటి వరకు 7.82 లక్షల మంది రైతులకు 4.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రూ.139.24 కోట్ల సబ్సిడీతో అందించామని తెలిపారు. 2025-26లో రూ.240 కోట్ల సబ్సిడీతో 8.08 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించగా, అత్యవసర విత్తనాల కోసం అదనంగా రూ.15 కోట్లు కేటాయించామని చెప్పారు. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి విత్తనాల పంపిణీ కోసం రూ.240 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతుకు సరైన సమయంలో నాణ్యమైన విత్తనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Exit mobile version