విశాఖపట్నం : విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏపీ కూటమి ఆధ్వర్యంలో అన్ని రంగాలలో దూసుకు పోతోందని ప్రశంసలు కురిపించారు భారత దేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రసంగించారు. రెండు రోజుల పాటు జరిగిన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలతో పాటు మేథోమథనం కూడా జరిగిందన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే సదస్సుకు కూడా పారిశ్రామిక వేత్తలను ఇప్పుడే సీఎం చంద్రబాబు ఆహ్వానించటం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అని కితాబు ఇచ్చారు ఉప రాష్ట్రపతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ వేర్వేరు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయని ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. విభజన గాయాలతో ఇబ్బందులు పడినా ఇప్పుడు అభివృద్ధిలో ఏపీ దూసుకు పోతోందన్నారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు రూ.22 లక్షల కోట్ల పెట్టుబడిని ఏపీ ఆకర్షించటం అసాధారణం అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా స్వర్ణాంధ్ర సాధన వైపు ఏపీ నడుస్తోందని తనకు సంతోషం కలిగించిందన్నారు .
పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఎలక్ట్రానిక్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం లాంటి రంగాల్లో పెట్టుబడుల్ని ఆకట్టుకుంటోందని చెప్పారు. ప్రతీ సంక్షోభ సమయంలో అంతే స్థాయిలో అవకాశాలను కూడా తీసుకు వస్తుందన్నారు. ఈ సమయంలో భారత్ తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అవకాశాలను అంది పుచ్చుకుంటోందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకునేలా దేశం ముందుకు వెళ్తోందని చెప్పారు సీపీ రాధాకృష్ణన్. గ్రోత్ ఇంజిన్లుగా వేర్వేరు రంగాలు అభివృద్ధి పథంలో వెళ్తున్నాయని అన్నారు . సమీప భవిష్యత్తులో టెక్నాలజీ రంగమే ఓ డ్రైవింగ్ ఫోర్సుగా నిలుస్తుందనటంలో సందేహం లేదన్నారు. ఏఐ లాంటి అధునాతన టెక్నాలజీని పాలన, పౌరసేవల కోసం వినియోగించటం అభినందనీయం అన్నారు.డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాను తయారు చేయటం ఓ కీలకమైన అంశంగా మారుతుందన్నారు.
మన తయారీ రంగంతో పాటు దేశీయ పరిశ్రమలు అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఉప రాష్ట్రపతి. దేశం ఓ బలమైన ఆర్ధిక శక్తిగా ఎదగడానికి అవసరమైన రంగాలపై మనం అంతా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలోనే ఎంఎస్ఎంఈలతో పాటు పరిశ్రమలు, పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించాలని కోరారు. మానవ వనరుల నైపుణ్యాలను పెంచుకుని భారతీయ మేధోసంపత్తిని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా రంగం, ఆవిష్కర్తలు ఒక్కతాటిపైకి వచ్చి భారత్ ట్రాన్సఫర్మేషన్ కోసం పని చేయాలని అన్నారు.కోవిడ్ సమయంలో ఆవిష్కరించి, ఉచితంగా ఇచ్చిన వాక్సిన్ 100 దేశాలకు ప్రాణం పోసిందన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అతిథులకు అందరికీ అభినందనలు తెలిపారు.
