హైదరాబాద్ : తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. విస్తృతంగా దాడులు చేపట్టింది. ఆయా శాఖలలో ఉన్నత స్థానాలలో ఉన్న వారు సైతం అడ్డంగా బుక్ అవుతున్నారు. ఏసీబీ దెబ్బకు విల విల లాడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అవినీతి మరింత పెరిగి పోయింది. లంచావతారాలు పెరిగి పోతున్నారు. మొన్నటికి మొన్న అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి అడ్డంగా లంచం తీసుకుంటూ దొరికి పోయాడు. అయినా వీళ్లకు సిగ్గు రావడం లేదు. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ విశ్వ విద్యాలయం ఓయూలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న శ్రీనివాసులు గుత్తేదారు నుండి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు.
ఫిర్యాదిధారుడు గుత్తెదారునిగా ఉస్మానియా విశ్వ విద్యాలయ ప్రాంగణంలో చేపట్టిన పునరుద్ధరణ పనులకు సంబంధించిన రూ.7,37,034/- విలువైన బిల్లులను విడుదల చేయడానికి, భవిష్యత్తు కాంట్రాక్టు పనులలో ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఉండటానికి ఫిర్యాదిధారుని నుండి రూ.11,000/- లంచం డిమాండ్ చేశాడు డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇప్పటికే రూ. 5,000/- తీసుకొన్నాడు. మిగిలిన రూ.6,000/- తీసుకుంటూ ఏసీబీ వలలో పడ్డాడు. రాకొండ శ్రీనివాసులు ఉస్మానియా విశ్వ విద్యాలయంలోని బిల్డింగ్ డివిజన్ లో ఉప కార్య నిర్వాహక ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా ఏసీబీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎవరైనా , ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగితే నేరుగా ఏసీబీ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1064కు చేయాలని లేదా సామాజిక మాధ్యమం వాట్సాప్ నెంబర్ 9440446106 కు , లేదా ఫేస్ బుక్ లోని తెలంగాణ ఏసీబీ, వెబ్ సైట్ (http://acb.telangana.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని కోరింది.
