తిరుపతి : తిరుమల కొండపై కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కునేందుకు లక్షలాది మంది భక్తులు నిత్యం తిరుపతికి వస్తుంటారు. ఈ సందర్బంగా ఇప్పుడు ఉన్న బస్టాండ్ సరి పోవడం లేదు. తాజాగా ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈమేరకు భారీ ఎత్తున అన్ని వసతులతో బస్టాండ్ ను నిర్మించాలని నిర్ణయించింది. ఇందు కోసం ప్లాన్ కూడా తయారు చేసింది. దీనిని రూ. 500 కోట్లతో నిర్మించేందుకు డిజైన్ కూడా రెడీ అయ్యింది. ఇందుకు గాఉ బస్ స్టాండ్‌లో కొత్త ఇంటర్-మోడల్ RTC బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. 13 ఎకరాల విస్తీర్ణంలో EV ఛార్జింగ్ స్టేషన్లు, మినీ డిపో గ్యారేజీతో కూడిన పునరాభివృద్ధికి డీపీఆర్ సిద్ధంగా ఉంది . త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సర్కార్ సిద్దం అవుతోంది.
గ్రౌండ్ ఫ్లోర్‌లో బస్టాండ్, దానిపై 10 అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు తదితరాలకు కేటాయించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో ఆర్టీసీ తన స్థలాన్ని కేటాయిస్తుండగా, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) కొంత సొమ్ము, మరో ప్రైవేటు గుత్తేదారు సంస్థను ఎంపిక చేసి దాని ద్వారా కొంత డబ్బు వెచ్చించనున్నారు. ప్రస్తుతం తిరుపతి బస్టాండ్ 13.18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో 12.19 ఎకరాల్లో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. ప్రస్తుతం బస్టాండ్‌కు మూడు వైపులా రోడ్లు ఉన్నాయి. కొత్తగా నిర్మించే టెర్మినల్‌కు మాత్రం నాలుగు వైపులా రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు.















