హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపింది రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్న కాల్పుల ఘటన. ఇందులో ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తో పాటు బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడి కావడం కలకలం రేపింది. ఈ ఇద్దరితో పాటు 11 మంది ఉన్నట్లు గుర్తించారు ఈగిల్ టీం ఎస్పీ గిరిధర్. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆచారి. ఆయన మీడియాతో మాట్లాడారు.
టీడీపీ సిట్టింగ్ ఎంపీ పుట్టా మహేష్, బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన కొంతమంది నాయకులతో కలిసి మాదకద్రవ్యాల సేవనంలో నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. దీనిపై తీవ్రమైన, సమగ్రమైన విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వారికి ఈ డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు? మొత్తం మాఫియా నెట్‌వర్క్‌ను బయటకు తీసుకొచ్చి, అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని శిక్షించాలని అన్నారు. వారు ఎంత పెద్దవారైనా సరే. ఈ సంఘటనలను కేటీఆర్ తో అనవసరంగా ముడిపెట్టే ప్రయత్నాలను చేయొద్దన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ వచ్చినప్పుడు, వారు రూ. 12,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారు డ్రగ్స్ విక్రయదారులు , తయారీదారులను పట్టుకున్నారు. 13 మందిని అరెస్టు చేశారు. తెలంగాణ పోలీసులు, తెలంగాణ ముఖ్యమంత్రికి ఆనాడు తెలియకుండా జరిగిందన్నారు. వీరు నిద్ర పోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు దాసోజు శ్రవణ్ కుమార్.



















