హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వీడారు. ఆయన తన స్వంత నివాసం నందిహిల్స్ కు చేరుకున్నారు. ఆదివారం కీలకమైన పార్టీ పరంగా అత్యవసర సమావేశం జరగనుంది. తన అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ కానుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించనున్నారు కేసీఆర్. ప్రధానంగా ఏపీ జల దోపిడీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ సమర శంఖం పూరించనున్నారు. సాగునీటి హక్కుల రక్షణ కోసం ‘మరో ప్రజా ఉద్యమం’ పై దిశా నిర్దేశం చేయనున్నారు. అంతే కాకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకే ఒప్పుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.
నాడు బీఆర్ఎస్ 91 టీఎంసీలు కేటాయిస్తే.. నేడు కాంగ్రెస్ కేంద్రం వద్ద మోకరిల్లిందని విమర్శించారు. నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆరోపణ చేశారు. రాష్ట్రానికి 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నోరు మెదపక పోవడంపై.. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ రైతాంగ ప్రయోజనాలపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రాజెక్టుల నిర్వహణ అట్టర్ ఫ్లాప్ అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలపై దిశానిర్దేశం చేయనున్నారు అధినేత కేసీఆర్.
