అమరావతి : ఏపీలో అమలవుతున్న భోజన పథకం, ‘స్మార్ట్ కిచెన్స్’ పై వస్తున్న నిరాధార ఆరోపణలపై స్పష్టత ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో అమలువుతున్న మధ్యాహ్న భోజన పథకంపై, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘స్మార్ట్ కిచెన్స్’ విధానంపై కొందరు రాజకీయ స్వార్థంతో చేస్తున్న ఆరోపణలు ముమ్మాటికీ అవాస్తవం అని పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర మాత్రమే తప్పా మరోటి కాదంది. ఈ ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు మరింత సమర్థవంతంగా, అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో, నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే ఏకైక సంకల్పంతోనే ప్రభుత్వం ‘స్మార్ట్ కిచెన్స్’ విధానాన్ని పరిశీలిస్తోంది. ఆధునిక సాంకేతికతను జోడించి విద్యార్థుల ఆరోగ్య భద్రతను మెరుగు పరచడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది.
స్మార్ట్ కిచెన్ల పేరుతో వంట కార్మికులను తొలగిస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఎక్కడా, ఒక్క కుక్‌ను కూడా తొలగించడం లేదు. దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న దాదాపు 85 వేల మంది అక్కచెల్లెమ్మల సేవలను ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని తెలిపింది. వారి సంక్షేమానికి, ఉపాధి భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. కార్మికుల పొట్ట గొట్టే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని కుండ బద్దలు కొట్టింది..
మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నెల వరకు జీతాలను/గౌరవ వేతనాలను పూర్తిగా చెల్లించడం జరిగింది. సాంకేతిక కారణాల వల్ల నిలిచిన మిగిలిన స్వల్ప బకాయిలను కూడా త్వరితగతిన విడుదల చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నిధులు సమ కూర్చింది. అతి త్వరలోనే ఈ నిధులు కార్మికుల ఖాతాల్లో జమ అవుతాయి. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన దాదాపు రూ. 350 కోట్ల రూపాయల పైచిలుకు బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం విజయవంతంగా విడుదల చేసింది.
