అమరావతి : ఆంధ్రప్రదేశ్ తెలుగు, సాంస్కృతిక అకాడమీ చైర్మన్ ఆర్.డి. విల్సన్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో భాషా పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందని స్పష్టం చేశారు. గురువారం విజయవాడలో విల్సన్ మీడియాతో మాట్లాడారు. చెన్నైలోని తమిళ వర్చువల్ అకాడమీ తరహాలో సుమారు రూ. 100 కోట్ల అంచనా వ్యయంతో తెలుగు వర్చువల్ అకాడమీని ఏర్పాటు చేయాలని అకాడమీ ప్రతిపాదించిందని వెల్లడించారు. తెలుగు భాషను పరిరక్షించడానికి , ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ తెలుగు, సాంస్కృతిక అకాడమీ అనేక కార్యక్రమాలను చేపడుతోందని అకాడమీ చైర్మన్ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు సమర్పించినట్లు తెలిపారు విల్సన్.
ఈ ప్రణాళిక ప్రకారం, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, భాషా నిపుణులు గంటకు రూ.500 గౌరవ వేతనంతో ఆన్‌లైన్‌లో తెలుగు బోధిస్తారని అన్నారు. శాశ్వత అకాడమీ భవన నిర్మాణానికి ఇప్పటికే రూ. 15 కోట్లు అందుబాటులో ఉన్నాయని, రాజధాని ప్రాంతంలో రెండు ఎకరాల భూమిని కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థికంగా బలోపేతం కావడానికి, అకాడమీ విశ్వ విద్యాలయాల నుండి ముద్రణ పనులను, ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేయాలని కోరారు. తిరుపతిలో భూమి తో పాటు సిబ్బంది సహాయం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలకు కూడా అభ్యర్థనలు పంపించినట్లు తెలిపారు. అకాడమీ జనవరి 2 నుండి విజయవాడ పుస్తక మహోత్సవంలో పుస్తక స్టాళ్లను ఏర్పాటు చేస్తుందన్నారు.

















