పంజాబ్ : ఆప్ కు చెందిన ఎంపీలు రాఘవ్ చద్దాతో పాటు మరికొందరు బీజేపీలోకి జంప్ అయ్యారు. ఈ సందర్బంగా తీవ్రంగా స్పందంచారు ఆప్ కు చెందిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఆయన ఇవాళ ఇదే విషయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతిని భారత రాజ్యాంగ సంరక్షకురాలుగా అభివర్ణిస్తూ, ఆమె తన ఆందోళనలను వింటారని సీఎం మాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలోకి ఫిరాయించడం పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. చేరిన ఎంపీలలో రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సహానీ , స్వాతి మాలివాల్ ఉన్నారు.
అయితే రాష్ట్రపతి భవన్ నుండి అధికారిక ఆహ్వానం ముఖ్యమంత్రికి మాత్రమే అందినప్పటికీ, ఆయనతో పాటు ఆప్ ఎమ్మెల్యేలు కూడా న్యూఢిల్లీకి వెళ్తున్నారు. పార్టీలు మారిన ఎంపీల గుర్తింపును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుందని పంజాబ్ మంత్రి అమన్ అరోరా అన్నారు. పంజాబ్ ప్రజలు వారిపై నమ్మకం ఉంచారు, కానీ వారు ఇప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. వారి గుర్తింపును రద్దు చేయాలి అని అరోరా అన్నారు. రాష్ట్రంలో మద్దతు పొందడం బీజేపీకి అంత సులభం కాదని ఆయన జోడించారు. ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నమని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా అభివర్ణించారు. 95 మంది ఆప్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి జోక్యం కోరతారని ఆయన అన్నారు.
