హైదరాబాద్ : తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఇచ్చిన రిపోర్టు తప్పుల తడకగా ఉందంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇంజినీరింగ్ ఎంట్రన్స్ రద్దు చేసి ఇంటర్ మార్కుల ద్వారా అడ్మిషన్లు ఇవ్వాలని కమిషన్ ఎలా చెబుతుందని ప్రశ్నించారు. ఇంటర్ మార్కుల ద్వారా ఇంజినీరింగ్ సీట్లు అంటే నష్టపోయేది గ్రామీణ ప్రాంత విద్యార్థులు కాదా ఆ మాత్రం సోయి లేకపోతే ఎలా అని నిలదీశారు ఆర్ఎస్పీ. కార్పొరేట్ కళాశాలలకు ఈ సిఫార్సు మేలు కలిగించదా అని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దు చేయాలని కమిషన్ రిపోర్టు ఇవ్వడం ఇది పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే చర్య అని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇష్టం లేకనే విద్యా కమిషన్‌తో ఆ మాట చెప్పించారని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకే గురుకులాలు రద్దు చేయాలంటున్నారని మండిపడ్డారు ఆర్ఎస్పీ. డిగ్రీ గురుకులాలు రద్దు చేయమంటున్నారు. ఇంతకంటే దారుణమైన చర్య ఉంటుందా? పేద విద్యార్థినుల కోసం డిగ్రీ గురుకులాలు ఏర్పాటు చేసిన విషయాన్ని మరచిపోతే ఎలా అని భగ్గుమన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన మహిళా డిగ్రీ గురుకులాలు మంచి ఫలితాలు ఇచ్చాయని గుర్తు చేశారు. మురళికి కోపం ఉంటే మమ్మల్ని కాల్చండి. పేద కుటుంబాలపై ఎందుకంత కోపం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ టీచర్లను మనుషులుగా చూశారని, తానే 8 వేల మంది గురుకులాల టీచర్ల నియామకం చేశానని తెలిపారు.
